అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
🚽 మలమూత్ర విసర్జన నియమాలు 🚽
"బహిర్ ప్రదేశానికి వెళ్ళేటప్పుడు ఖుర్ఆన్ సూక్తులుగాని, అల్లాహ్ పేర్లు రాసి వున్న కాగితాలు గాని వెంట తీసుకెళ్ళకూడదు." (అబూదావూద్, ఇబ్నెమాజా)
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) చేతికి ఒక ఉంగరం ఉండేది. దానిమీద “ముహమ్మదుర్ రసూలుల్లాహ్" అని నగిషీ చెక్కబడి ఉండేది. ఆయన బహిర్ భూమికి వెళ్ళినప్పుడల్లా ఆ ఉంగరం తీసి వెళ్ళేవారు. (ముస్లిం, అబూదావూద్)
మరుగు దొడ్డికి వెళ్ళేటప్పుడు ముందుగా ఎడమకాలు పెట్టి లోనికి ప్రవేశిస్తూ ఈ ప్రార్థన వచనాలను పఠించాలి:
"అల్లాహుమ్మ ఇన్నీ అవూజు బిక మినల్ ఖుబుసి వల్ ఖబాయిస్”
భావం : అల్లాహ్! దుష్టులైన స్త్రీ పురుషుల (మానవులు, జిన్నాతుల) బారి నుండి నీ శరణు కోరుతున్నాను. (బుఖారీ-ముస్లిం)
"మరుగు దొడ్డిలో దైవప్రస్తావన తేకూడదు. ఎవరయినా సలాం చేస్తే దానికి ప్రతి సలాం కూడా చేయకూడదు. మలమూత్ర విసర్జన చేసేటప్పుడు ఇతరులతో మాట్లాడకూడదు." (అహ్మద్, అబూదావూద్)
"మలమూత్ర విసర్జన సమయంలో ఖిబ్లా వైపుకు తిరిగి లేక ఆ వైపుకు వీపు పెట్టి కూర్చోరాదు." (బుఖారీ - ముస్లిం)
"మధ్యలో ఏదయినా వస్తువు అడ్డంగా ఉన్నప్పుడు అలా కూర్చుంటే అభ్యంతరం లేదు." (బుఖారీ-ముస్లిం)
"ఎవరికీ కనపడని ప్రదేశానికి వెళ్ళి మలమూత్ర విసర్జన చెయ్యాలి. ఆ సమయంలో ఇతరులెవరూ తమల్ని చూడకుండా జాగ్రత్త పడాలి." (అబూదావూద్ - ఇబ్నెమాజా)
"మలమూత్ర విసర్జన తర్వాత ఆయా అవయవాలను నీటితో శుభ్రం (ఇస్తింజా) చేసుకోవాలి." (బుఖారీ -ముస్లిం)
"ఇస్తింజా ఎడమ చేత్తో చేసుకోవాలి. కుడి చేత్తో ఇస్తింజా చేయరాదు." (ముస్లిం)
మరుగు దొడ్డి నుండి వెడలిన తర్వాత చేయవలసిన ప్రార్థన
మరుగు దొడ్డినుండి వెడలినప్పుడు ముందుగా కుడి కాలు బయట పెట్టాలి. ఆ తరువాత “గుఫ్‌రానక” (అల్లాహ్! నేను నీ మన్నింపుని వేడుకుంటున్నాను) అని అనాలి. (అహ్మద్, అబూదావూద్)
"మట్టి పెడ్డలతోగాని, రాళ్ళతోగాని ఇస్తింజా చేయాలనుకున్నప్పుడు దాని కోసం కనీసం మూడు పెడ్డలనయినా ఉపయోగించాలి." (బుఖారీ-ముస్లిం)
"పిడకలు, ఎముకలతో ఇస్తింజా చేయకూడదు." (ముస్లిం)
"మూత్ర విసర్జన కూర్చొని చేయాలి." (బుఖారీ)
అనివార్య కారణాలుంటే నించొని కూడా మూత్ర విసర్జన చేయవచ్చు. (హదీసువేత్తల బృందం' ఈ హదీసుని వెలికి తీసింది. అల్బానీ (రహ్మలై) దీన్ని ప్రామాణికమైనదిగా ఖరారు చేశారు.)
అనివార్య కారణాలు అంటే కూర్చొని మూత్ర విసర్జన చేయడానికి అనువుగా లేని పరిస్థితులు. ఉదా: చుట్టుప్రక్కలా చెత్తాచదారం ఉన్నప్పుడు, మరుగుదొడ్డి లేక టాయిలెట్ సీటు అపరిశుభ్రంగా ఉన్నప్పుడు.
"మూత్ర విసర్జన చేసినప్పుడు దాని తుంపరలు శరీరం మీదగాని, దుస్తుల మీదగాని పడకుండా జాగ్రత్తపడాలి. ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సమాధి శిక్షకు గురయ్యే ప్రమాదముంది." (బుఖారీ)
"జనులు నడిచేదారుల్లో, నీడనిచ్చే ప్రదేశాల్లో మలమూత్ర విసర్జన చేయరాదు." (అబూదావూద్)
"కన్నాల్లో, బిలముల్లో మూత్ర విసర్జన చేయకూడదు." (అహ్మద్, అబూదావూద్)
ఇస్తింజా చేసుకున్న తర్వాత చేతిని నేల మీద రుద్దాలి (లేదా సబ్బుతో కడుక్కోవాలి). దాని వల్ల చేతి నుండి దుర్వాసన రాకుండా ఉంటుంది. "దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఇస్తింజా చేసిన తరువాత చేయి నేలమీద రుద్దేవారు." (అబూదావూద్, నసాయి)
No comments:
Post a Comment