Hellobar

Saturday, December 18, 2021

మస్జిద్‌

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
     

           🕌 మస్జిద్‌ల గురించి 🕌



              మస్జిద్ అంటే ఏమిటి?


          మస్జిద్ అంటే సజ్దా చేసే చోటు అని అర్థం. ప్రత్యేకంగా అల్లాహ్ ఆరాధన కోసం నిర్మించబడిన ఆలయాన్ని మస్జిద్ అంటారు. నమాజ్ చేయాలనుకునే వారందరూ అక్కడికి వెళ్ళి సామూహికంగా నమాజ్ చేస్తారు.

          మస్జిద్‌ను కేవలం ఆరాధనాలయంగానే భావించకూడదు. వాస్తవానికి ఈ మస్జిద్‌లు ఇస్లామీయ కోటలు. ఇస్లాం ధర్మకేంద్రాలు. ఇక్కణ్ణుంచే ఇస్లాం వెలుగు ప్రపంచంలోని నలుదిశలకూ వ్యాపించి విశ్వాన్నంతటినీ జ్యోతిర్మయం చేస్తుంది. ఈ మస్జిదుల నుంచే సరైన ఇస్లామీయ బోధనలు జనబాహుళ్యంలో ప్రచారం నొందుతాయి. స్వచ్ఛమైన ఏక దైవోపాసనకు ప్రాచుర్యం లభిస్తుంది. మస్జిదుల్లో ముస్లింలందరూ తరతమ భేదాలన్నీ కట్టి పెట్టి పాలూనీళ్ళల్లా కలిసి పోతారు. అల్పుడూ, అధికుడు, పేదవాడు, ధనికుడు, అరబ్బుడు అరబ్బేతరుడు, నల్లవాడు తెల్లవాడన్న భేదభావాలన్నీ మరచి ఒకే వరుసలో నిలుచుంటారు.


మస్జిదుల ఘనత

          మస్జిదులతో సంబంధం పెట్టుకోవటం, సంప్రతింపులు జరపటం విశ్వాసుల లక్షణమని చెప్పబడింది. అల్లాహ్ ఇలా అంటున్నాడు:

           "అల్లాహ్‌నూ, అంతిమ దినాన్ని విశ్వసించి, నమాజును స్థాపించేవారు, జకాత్ ఇచ్చేవారు, అల్లాహ్‌కు తప్ప మరెవరికీ భయపడనివారు మాత్రమే అల్లాహ్ యొక్క మస్జిదులకు సంరక్షకులూ, సేవకులూ కాగలుగుతారు.” (ఖుర్ఆన్ : 9:18)

           దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఇలా ప్రబోధించారు : "మీరు ఒక వ్యక్తిని మస్జిద్‌కు వస్తూ పోతూ ఉండగా చూసినట్లయితే, అతని విశ్వాసం (ఈమాన్) గురించి మీరు సాక్ష్యమివ్వండి." (అహ్మద్, తిర్మిజీ)

           మరో సందర్భంగా దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఇలా అన్నారు: "అల్లాహ్ దృష్టిలో అన్ని చోట్లలోకెల్లా అత్యంత శ్రేయస్కరమైన చోటు మస్జిదు. అన్ని చోట్లలోకెల్లా అత్యంత హాని (ప్రమాద)కరమైన చోటు బజారు." (బుఖారీ)

           ఆయన ఇంకా ఇలా అన్నారు: 'ఉదయం పూటగాని, సాయంత్రం వేళగాని ఎవరయినా మస్జిద్‌కు వెళితే అల్లాహ్ అతని ఆతిథ్యం కోసం స్వర్గంలో బసను ఏర్పాటు చేస్తాడు. అతను ఉదయంపూట, సాయంత్రంవేళ ఎప్పుడు వెళ్ళినా సరే!" (బుఖారీ-ముస్లిం)

          ఆయన ఇంకో సందర్భంగా ఇలా అన్నారు: "ఎవరయినా అల్లాహ్ కోసం మస్జిద్‌ను నిర్మిస్తే, అల్లాహ్ అతని కోసం స్వర్గంలో ఒక ఇల్లు నిర్మిస్తాడు." (బుఖారీ-ముస్లిం)

          ఆయన ఇంకా ఇలా అన్నారు: "నా ఈ మస్జిద్ (అనగా మస్జిదె నబవీ)లో చేసే ఒక నమాజు ఇతర మస్జిదుల్లో చేసే వెయ్యి నమాజుల కంటే శ్రేష్ఠమైనది. ఇంకా మస్జిద్ హరామ్‌లో చేసే ఒక నమాజు ఇతర మస్జిదుల్లో చేసే లక్ష నమాజుల కంటే శ్రేష్ఠమైనది." (అహ్మద్, ఇబ్నెమాజా)

          ఆయన ఇలా కూడా అన్నారు: "ఎవరయినా తన ఇంటి దగ్గర వుజూచేసుకొని, ఆ తర్వాత అల్లాహ్ గృహాలలో ఏదయినా ఒక గృహంలో, అల్లాహ్ ఫర్జ్ (నమాజు)లలో ఏదయినా ఒక ఫర్జ్‌ను నిర్వర్తించటానికి బయలుదేరితే, అతని ప్రతి అడుగు ఒక పాపాన్ని తుడిచేస్తుంది, మరో వైపు ఒక అంతస్తుని పెంచుతుంది." (ముస్లిం)

           అంటే అతను వేసే ప్రతి అడుగుకు బదులుగా అతని కర్మల పత్రంలో ఒక పుణ్యం లిఖించబడుతుంది. అతని పరలోకపు అంతస్తులు పెరుగుతాయి. పాపాలు మన్నించబడతాయి.

No comments:

Post a Comment