Hellobar

Saturday, December 18, 2021

దరూద్ షరీఫ్ లాభాలు

 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.


         దరూద్ షరీఫ్ లాభాలు


                హజ్రత్ అనస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: "ఎవరయినా నా పై ఒకసారి దరూద్ పఠిస్తే అల్లాహ్ అతనిపై పదిసార్లు కారుణ్యం కురిపిస్తాడు. అతని పది పాపాలను మన్నిస్తాడు. ఇంకా అతని పది అంతస్తులను పెంచుతాడు." (నసాయి - సహీహ్ : అల్బానీ గారి సహీహ్ సుననె నసాయి గ్రంథం, మొదటి సంపుటి 1230వ హదీసు)

              హజ్రత్ ఇబ్నె మస్‌వూద్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : "నా పై అత్యధికంగా దరూద్ పఠించేవాడు ప్రళయ దినాన నాకు అందరికన్నా సమీపంలో ఉంటాడు." (తిర్మిజీ - సహీహ్ : అల్బానీ గారి మిష్కాతుల్ మసాబీహ్ గ్రంథం, మొదటి భాగం 923వ హదీసు)

           హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ అమ్ర్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు: "ఎవరయినా నాపై దరూద్ పఠిస్తే, నాకు ‘వసీలా' (స్వర్గంలో ఒక ఉన్నత స్థానం) లభించాలని దైవాన్ని కోరుకుంటే, ప్రళయ దినాన నేను వారి గురించి తప్పకుండా సిఫారసు చేస్తాను." (అల్బానీ గారి 'ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి' గ్రంథం 50వ హదీసు)

(ఇస్మాయీల్ ఖాజీగారు దీనిని 'ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి' గ్రంథంలో పేర్కొన్నారు. ఇది 'సహీహ్' కోవకు చెందిన హదీసు)

            హజ్రత్ ఉబై బిన్ కాబ్ (రజి) కథనం : నేనొకసారి దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం)తో మాట్లాడుతూ "దైవప్రవక్తా! నేను మీ పై అత్యధికంగా దరూద్ పంపుతూ ఉంటాను, వాస్తవానికి నేను నా ప్రార్థనలో ఎంతసేపు మీ పై దరూద్ పఠించాలి?" అని అడిగాను. అందుకాయన "నీకిష్టమయినంత సేపు" అని అన్నారు. "నా ప్రార్థనలో నాల్గో వంతు మీ దరూద్ కోసం కేటాయిస్తే సరిపోతుందా?" అని అడిగాను. "సరిపోతుంది. కాని అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచింది" అని అన్నారాయన. "నేను సగం ప్రార్థన దరూద్ కోసం కేటాయిస్తాను" అన్నాను. దానికాయన "సరే, నీ యిష్టం. కానీ అంతకన్నా ఎక్కువ సేపు దరూద్ పఠిస్తే అది నీకే మంచిది" అని అన్నారు.

                 నేను మళ్ళీ "అయితే మూడింట రెండు వంతుల ప్రార్థన దాని కోసమే కేటాయించమంటారా?" అని అడిగాను. ఆయన (స) "నీ యిష్టం. ఇంకా ఎక్కువ సమయం దరూద్ పఠిస్తే అది నీకే మంచిది" అని అన్నారు. చివరికి నేను "మరయితే నా ప్రార్థన అంతా దరూద్ కోసమే ప్రత్యేకించుకుంటాను" అని అన్నాను. అప్పుడాయన "ఈ పద్ధతి నీ దుఃఖ విచారాలన్నిటినీ దూరం చేస్తుంది. నీ పాపాల మన్నింపుకు దోహదపడుతుంది" అని చెప్పారు. (తిర్మిజీ - హసన్ : అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ రెండో సంపుటి 1999వ హదీను)

            హజ్రత్ అబ్దుర్రహ్మాన్ బిన్ ఔఫ్ (రజి) కథనం: "ఒక రోజు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఇంటి నుండి బయలుదేరి ఖర్జూరపు తోటలోకి వెళ్ళారు. అక్కడ ఆయన సజ్దా చేశారు. చాలా సేపటి పరకు అలాగే ఉండిపోయారు. ఎంతసేపటికీ సజ్దా నుండి లేవకపోవటంతో అదే స్థితిలో ఆయన ప్రాణం గాని పోయి వుంటుందేమోనని భయమేసింది నాకు! నేనాయన వైపు అలాగే చూస్తుండిపోయాను." అంతలో ఆయన తలపైకెత్తి "ఏమయింది?" అని అడిగారు. "నేను నాకు తోచింది చెప్పాను." అప్పుడాయన నాతో ఇలా అన్నారు :

                 (నేను సజ్దా స్థితిలో ఉన్నప్పుడు) జిబ్రయీల్ దూత నన్ను సంబోధిస్తూ, "ఓ ముహమ్మద్! నేను మీకో శుభవార్త తెల్పనా? 'మీ పై దరూద్ పంపిన వ్యక్తిపై తాను కారుణ్యాన్ని కురిపిస్తాననీ, మీ శాంతిని కోరేవారిపై తానూ శాంతిని అవతరింపజేస్తానని' అంటున్నాడు అల్లాహ్" అని చెప్పారు. (అహ్మద్ - సహీహ్ : అల్బానీ గారి ఫజ్లుస్సలాత్ అలన్నబియ్యి గ్రంథం 7వ హదీసు)

           హజ్రత్ అబూ తల్హా (రజి) కథనం: ఓ రోజు దైవప్రవక్త (సల్లం) మా దగ్గరికి వచ్చారు. ఆ సమయంలో ఆయన ముఖారవిందం ఆనందాతిశయంతో వెలిగిపోతూ ఉంది. అది చూసి మేము "ఈ రోజు మీ ముఖారవిందంలో సంతోషం తొణకిసలాడుతున్నట్లు కన్పిస్తుందే" అని అన్నాం. అప్పుడాయన మాకు ఇలా తెలియజేశారు -

                    నా దగ్గరకు జిబ్రయీల్ దూత వచ్చి ఓ శుభవార్త చెప్పి వెళ్ళారు. అల్లాహ్ నన్ను ఉద్దేశ్యించి, "ముహమ్మద్! ఎవరయినా మీపై ఒకసారి దరూద్ పఠిస్తే, నేనతనిపై పదిసార్లు కారుణ్యాన్ని కురిపిస్తాను. ఎవరయినా ఒకసారి మీపై శాంతి కలగాలని కోరుకుంటే నేను వారిపై పదిసార్లు శాంతిని అవతరింపజేస్తాను. ఇది మీకు సంతోషకరమే కదా! అని అడుగుతున్నాడట?" (నసాయి - హసన్ : అల్బానీ గారి సహీహ్ సుననె నసాయి మొదటి సంపుటి 1216వ హదీసు)

            హజ్రత్ అబూదర్దా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా ప్రవచించారు : "ఎవరయితే ఉదయం పదిసార్లు, సాయంత్రం పదిసార్లు నాపై దరూద్ పఠిస్తారో, ప్రళయ దినాన వారికి నా సిఫారసు లభిస్తుంది." (తబ్రానీ - హసన్ : అల్బానీ గారి ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథం - 11 హదీసు)

              హజ్రత్ అబ్దుల్లాహ్ బిన్ మస్‌వూద్ (రజి) కథనం: ఓ రోజు నేను నమాజ్ చేస్తుండగా దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం), ఆయనతోపాటు అబూబక్ర్, ఉమర్ (రజి)లు కూడా (నాకు సమీపంలోనే) కూర్చొని ఉన్నారు. నేను (నమాజ్ ముగించుకొని దుఆ కోసం) కూర్చొని ముందుగా దైవాన్ని స్తుతించాను. తరువాత దైవప్రవక్త (సల్లం) పై దరూద్ పఠించి ఆ తరువాత నా స్వయం కోసం దుఆ చేసుకున్నాను. అది విని దైవప్రవక్త (సల్లం) "(అలాగే) అల్లాహ్‌ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించబడుతుంది. (మళ్ళీ) అల్లాహ్‌ను ప్రార్థించు, నీకు తప్పకుండా ప్రసాదించటం జరుగుతుంది" అని పురికొల్పారు. (తిర్మిజీ - హసన్ : అల్బానీ గారి సహీహ్ సుననె తిర్మిజీ మొదటి సంపుటి 486వ హదీసు)
              
‌              హజ్రత్ ఆమిర్ బిన్ రబీఆ తన తండ్రి నుండి చేసిన కథనం ప్రకారం తను దైవప్రవక్త (సల్లం) ఈ విధంగా ప్రవచిస్తుండగా విన్నారు : "ఏ ముస్లిం వ్యక్తి అయినా నాపై దరూద్ పఠిస్తూ ఉన్నంత వరకు దైవదూతలు అతనిపై కారుణ్యం కురవాలని ప్రార్థిస్తూనే ఉంటారు. కనుక ఇక మీ యిష్టం. దరూద్ తక్కువగానయినా పఠించండి లేదా ఎక్కువగానయినా పఠించండి."

         (దీనిని ఇస్మాయీల్ ఖాజీ ఫజ్లుస్సలాతి అలన్నబియ్యి గ్రంథంలో పేర్కొన్నారు. ఇది 'హసన్' కోవకు చెందిన హదీసు : అల్బానీ గారి మిష్కాతుల్ మసాబీహ్ గ్రంథం మొదటి సంపుటి 725వ హదీసు)

No comments:

Post a Comment