అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
వడ్డీ పిశాచం
"వడ్డీ విధానాలు రూపుమాని దానధర్మాలు అధికం కావాలన్నది ఇస్లాం ఆకాంక్ష.”
నేడు ప్రపంచాన్ని పట్టి పీడుస్తోన్న అనేక సమస్యల్లో వడ్డీ పిశాచం ఒకటి. తోటివారి అవసరాన్ని సొమ్ము చేసుకుంటూ వడ్డీలకు అప్పు ఇచ్చి, అసలు కంటే ఎక్కువ సొమ్ము దండుకునే ఈ సామాజిక దురాచారం ఈనాటిది కాదు, దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం ) రాకకు మునుపు అజ్ఞానకాలం నుంచే ఈ మహమ్మారి చెలామణి అవుతూ వస్తోంది. దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) తమ జీవితకాలంలో, ఆ తర్వాత ఇస్లాం ధర్మ ప్రతినిధులందరూ కూడా తమతమ కాలాల్లో ఈ వడ్డీ పిశాచ విషకోరల్ని పెరికివేయటానికి అన్ని విధాలా కృషి చేశారు. ఎదుటివారి అవసరాన్ని సొమ్ము చేసుకోవటం అమానుషమనీ, అల్లాహ్ తమను ఏ అవసరం లేకుండా చల్లగా చూస్తున్నప్పుడు తమకు చేతనయినంతలో ఎదుటి వారికి సహాయం చేసి ఆదుకోవటం మానవ ధర్మమని లోకానికి చాటి చెప్పారు. వడ్డీలకు అప్పులు ఇవ్వటం ఎంతటి నీచమైన పనో దివ్యఖుర్ఆన్‌లోని ఈ సూక్తిని చూస్తే మనకు అర్థమవుతుంది:
"వడ్డీ తినేవారి స్థితి షైతాను పట్టడం వల్ల ఉన్మాది అయిన వ్యక్తి స్థితి లాంటిది. ఈ స్థితికి వారు గురికావటానికి కారణం వారు 'వ్యాపారం కూడా వడ్డీలాంటిదేగా' అని అనటమే. నిజానికి అల్లాహ్ వ్యాపారాన్ని ధర్మసమ్మతం (హలాల్) చేశాడు. కనుక తన ప్రభువు చేసిన ఈ హితబోధ అందేవ్యక్తి మున్ముందు వడ్డీ తినటం త్యజిస్తే, అతను పూర్వం తిన్నదేదో తిన్నాడు. అతని వ్యవహారం చివరికి అల్లాహ్ వద్దకే పోతుంది. ఈ ఆదేశం తర్వాత కూడా మళ్లీ ఈ దుశ్చేష్టకు పాల్పడేవాడు నిశ్చయంగా నరకవాసి, అక్కడ అతడు శాశ్వతంగా ఉంటాడు." (ఖుర్ఆన్ : 2:275)
ధనవంతుణ్ణి మరింత ధనవంతుడిగా, బీదవాణ్ణి మరింత బీదవాడిగా మార్చే ఈ వడ్డీ విధానాలు జకాత్ వ్యవస్థకీ, మొత్తం ఇస్లాం ధర్మానికి విరుద్ధం. వడ్డీ వల్ల సమాజంలో అపసవ్యత, ఆర్థిక అసమానతలు చోటు చేసుకుంటాయి. దివ్యఖుర్ఆన్‌లో రెండవ సూరాలోని 276వ సూక్తిలో ఇలా సెలవీయబడింది:
"అల్లాహ్ వడ్డీని తుడిచి పెట్టేసి దానధర్మాలను పెంపొందిస్తున్నాడు."
కాని శోచనీయమైన విషయం ఏమిటంటే. ఒక వైపు ధనవంతుడు బారువడ్డీ, చక్రవడ్డీ అనే కొంగ్రొత్త దోపిడీ విధానాలతో పేదవాడి రక్తాన్ని పిండుకుంటూ సమాజ ఆర్థిక స్థితిని పీల్చి పిప్పి చేస్తుండగా మరోవైపు నిరుపేదలు కూడా ఎక్కువ పెట్టుబడి పెడితే వ్యాపారంలో వృద్ధి జరుగుతుందనో, తమ జీవన ప్రమాణం పెరుగుతుందనో, అనేక సాకులు చూపెట్టి, ఇహలోకమే సర్వసంగా భావించి జీవిస్తున్నవారి మాటలకు మోసపోయి వడ్డీ మత్తుమందుకు బానిసలైపోతున్నారు.
పేదవారి వ్యాపారంలో అభివృద్ధి కోసం, వారి జీవన ప్రమాణాలను మెరుగు పరచటం కోసం అల్లాహ్ జకాత్ వ్యవస్థను నెలకొల్పాడు. దానధర్మాలను, మానవీయ విలువల్ని వృద్ధి చేసుకోమని ప్రబోధించాడు. దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) అజ్ఞానకాలపు వడ్డీ విధానాలన్నిటిని తమ కాళ్లకింద నలిపి పారేసి పరోపకార భావాన్ని దైవప్రసన్నతా ఉద్దేశ్యంతో ఇచ్చే అప్పులను ప్రోత్సహించారు. ఇస్లాం ధర్మం మనకు ప్రసాదించిన ఈ వరాలను సద్వినియోగం చేసుకోకుండా వడ్డీతోనే 'అభివృద్ధి' జరుగుతుందని తలపోయటం మూర్ఖత్వం. వడ్డీ విధానాలు సమాజం పాలిట, మానవుని ఆర్థిక, ఆధ్యాత్మిక శ్రేయస్సుల పాలిట ఎంత ప్రమాదకరమో దివ్యఖుర్ఆన్ సూక్తులను, దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) హదీసులను గమనిస్తే మనకు బోధపడుతుంది:
"విశ్వసించిన ప్రజలారా! మీరు నిజంగా విశ్వాసులే అయితే అల్లాహ్‌కు భయపడి ప్రజల నుండి మీకు రావలసిన వడ్డీని విడిచి పెట్టండి. మీరు వడ్డీని మానుకోని పక్షంలో మీ పై అల్లాహ్ తరఫు నుండి యుద్ధప్రకటన ఉందన్న విషయాన్ని మర్చిపోకండి." (ఖుర్ఆన్ : 2:278)
దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం) ఇలా ప్రవచించారు: “వడ్డీతో కూడిన ఒక్క దిర్హమ్‌ను తిన్నవాడు ముప్పయిఆరు సార్లు వ్యభిచారం చేసిన దానికన్నా ఎక్కువ పాపం చేసినట్లు లెక్క." (ముస్నదె అహ్మద్, తబ్రానీ)
No comments:
Post a Comment