అస్సలాము అలైకుమ్ వ రహ్మతుల్లాహి వ బరకాతుహూ.
అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
🏠 ఇంట్లోకి ప్రవేశించటం 🏠
ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు తల్లిదండ్రులకు, భార్యాపిల్లలకు సలాం చేస్తే దాని వల్ల ఇంట్లోవున్న వారికి శుభశ్రేయాలు ఒనగూరుతాయి. అల్లాహ్ ఇలా సెలవిచ్చాడు:
"మీరు ఇళ్లల్లోకి ప్రవేశించేటప్పుడు మీ వాళ్ళకు సలాం చేసి ప్రవేశించండి. ఇది మేలు కొరకు చేయబడే ప్రార్థన. అల్లాహ్ తరఫున నిర్ణయించబడింది. ఎంతో శుభవంతమైనది, పరిశుద్ధమైనది." (ఖుర్ఆన్ : 24 : 61)
హజ్రత్ అనస్ (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) తనకు ఈ విధంగా తాకీదు చేశారు: “నాయనా! నువ్వు మీ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ముందుగా మీ ఇంట్లో వాళ్ళకు సలాం చెయ్యి. ఇది నీకూ, మీ ఇంటివారికి ఎంతో శుభవంతమైన పద్ధతి." (తిర్మిజీ)
ఇతరుల ఇండ్లల్లోకి ప్రవేశించేటప్పుడు కూడా ముందుగా ఆ ఇంటి వారికి సలాం చేయాలి. ఇంటి వారి అంగీకారం పొందనంతవరకు లోనికి ప్రవేశించరాదు. అల్లాహ్ ఇలా సెలవిస్తున్నాడు:
"విశ్వాసులారా! మీ ఇళ్ళల్లోకి తప్ప ఇతరుల ఇళ్ళల్లోకి ప్రవేశించకండి, ఆ ఇంటి వారి అంగీకారం పొందనంత వరకు, వారికి సలాం చేయనంత వరకు. ఈ పద్ధతి మీకు ఎంతో ఉత్తమమైనది. దీనిని మీరు పాటిస్తారని ఆశించబడుతోంది." (ఖుర్ఆన్ : 24 : 27)
No comments:
Post a Comment