అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను
💠 సమాధులను వేడుకోవడం 💠
కొందరూ సమాధులను వేడుకోవడం తప్పు కాదు అని చెపుతారు. సమాధి పూజారులు కొన్ని ఆయతులను ఆధారాలుగా చూపిస్తారు. వాటి గురించి తెలుసుకుందాము.
మొదటి ఆయత్:
"అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులు అని అనకండి. వాస్తవానికి వారు సజీవులు. కానీ మీరు వారి జీవితాన్ని గ్రహించలేరు.” (ఖుర్ఆన్ : బఖర : 154)
ఇక రెండవ ఆయత్:
“అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని మృతులుగా భావించకండి. వాస్తవానికి వారు సజీవులే. తమ ప్రభువు వద్ద జీవికను పొందుతున్నారు.” (ఖుర్ఆన్ : ఆలి ఇమ్రాన్ : 169-171)
అల్లాహ్, వారిని 'సజీవులు' అని అన్నాడు కాబట్టి వారిని వేడుకోవడంలో తప్పులేదు అని మూర్ఖంగా వాదిస్తూ వుంటారు.
ఇక ఈ ఆయతులపై స్వయంగా దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏమని వ్యాఖ్యానించారో చూద్దాం :
మస్రూఖ్ (రజి అల్లాహు అన్హు) కథనం : మేము అబ్దుల్లా బిన్ మస్‌వూద్ (రజి అల్లాహు అన్హు)తో ఆలి ఇమ్రాన్ 169-171, ఆయతులను గురించి అడిగాం. దానికాయన - మేము ఈ ఆయతులను గురించి దైవ ప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వ సల్లం)ను అడగ్గా దానికాయన ఈ విధంగా వ్యాఖ్యానించారని చెప్పారు:
"షహీదుల ఆత్మలు పచ్చటి పక్షుల రూపంలో అర్ష్ క్రింద వ్రేలాడుతూ వుండే లాంతర్ల వంటి గూళ్ళలో వుంటాయి. అవి స్వర్గంలో అటూ ఇటూ తిరుగుతూ, తమకిష్టమైనవి తింటూ తిరిగి తమ గూటిలోకి వచ్చి చేరుతాయి." ఒకసారి వారి ప్రభువు వారిని - "ఇంకేమైనా మీరు కోరుకుంటున్నారా?" అని అడిగాడు. దానికి వారు "మాకింకేం కావాలి ప్రభూ! మేం స్వర్గంలో ఎక్కడైనా వెళ్ళగలం, ఏదైనా తినగలం" అని జవాబిచ్చారు. వారి ప్రభువు మళ్ళీ అడిగాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ అడిగాడు. చివరికి వారు, 'మనమేదైనా కోరుకోనిదే మన ప్రభువు యిక మనల్ని వదలడు' అని అనుకొని వారు అల్లాహ్‌తో, "మా ప్రభూ! మేము కోరేదేమిటంటే మా ఆత్మలను తిరిగి నువ్వు మా శరీరాలతో కలిపేయి, తద్వారా మేము మళ్ళీ నీ మార్గంలో పోరాడి షహీదులవుతాం" అని అన్నారు. ఇది విని, వారి ప్రభువు “యిక వీరికే విధమైన కోరికలు లేవు అని అనుకొని వారిని వదిలేశాడు." (సహీ ముస్లిం : కితాబుల్ అమారత్, బాబ్ : ఫీ బయాని అన్న అర్వాహష్షాహాదాహి.....)
ఇదండీ ఈ ఆయతులకు సంబంధించిన అసలు విశ్లేషణ.
దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) గారి విశ్లేషణకూ, ప్రస్తుతం జరిగే సమాధి పూజలకూ ఏ మాత్రమైనా సంబంధం వుందా చెప్పండి?
అందుకే దివ్య ఖుర్ఆన్‌ను, యావత్తు దైవ ధర్మాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడానికి దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మరియు ఆయన సహచరులు చేసిన విశ్లేషణ, వారి దృక్పథం తప్పనిసరి. అప్పుడే మనం పెడత్రోవ పట్టకుండా రుజు మార్గంలో వుండగలుగుతాం. ఎందుకంటే, దివ్య ఖుర్ఆన్‌ను అల్లాహ్ దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) పై అవతరింపజేశాడు. ఆయతుల వాస్తవిక అర్థాన్ని కూడా స్వయంగా తనే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం)కు తెలియపరిచాడు. ఆ విశ్లేషణనే దైవ ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) తమ సహచరులకు వినిపించేవారు. అందువల్ల వీరు అల్లాహ్ ఆయతులను తప్పుగా ఎప్పుడూ విశ్లేషించలేరు.
ఇక వారి వ్యాఖ్యానాన్నీ, విశ్లేషణనూ పెడచెవిన పెట్టి స్వంత లేక ఇతరుల బుద్ధి జ్ఞానాలు ఉపయోగించి విశ్లేషించడం మొదలు పెట్టినప్పుడే మార్గ భ్రష్టులయ్యేది. దురదృష్టవశాత్తు ముస్లిం సమాజంలో ఇదే జరిగింది. అసలు ముస్లిం సమాజంలో ఇన్ని వర్గాలు ఉనికిలోకి రావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణమై నిలిచింది.
No comments:
Post a Comment