Hellobar

Monday, December 20, 2021

🤝 కరచాలనం, ఆలింగనం 🤝

 

అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.


        🤝 కరచాలనం, ఆలింగనం 🤝


           ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తి పట్ల తమకున్న ప్రేమాభిమానాల్ని, ఆప్యాయతానురాగాల్ని వ్యక్తం చేసుకునే మరో పద్ధతి కరచాలనం, ఆలింగనం. కరచాలనంతో సలాం యొక్క ఉద్దేశ్యాలు, లక్ష్యాలు కూడా నెరవేరుతాయి. అందుకే కరచాలనం సలాంలో అంతర్భాగం అని చెప్పబడింది.

           "కరచాలనంతో మీ సలాం పరిపూర్ణమవుతుంది.” (తిర్మిజీ)

           దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఈ విధంగా ప్రవచించారు : "ఇద్దరు ముస్లింలు కలుసుకొని కరచాలనం చేసుకుంటే వారు పరస్పరం విడిపోకముందే వారిరువురి పాపాలూ మన్నించబడతాయి." (అహ్మద్, తిర్మిజీ)

           ఒక హదీసులో దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఈ విధంగా ప్రబోధించారు: "పరస్పరం కరచాలనం చేసుకుంటూ ఉండండి. దానివల్ల మీ హృదయాల నుండి అక్కసు దూరమవుతుంది. ఒండొకరికి కానుకలు ఇచ్చి పుచ్చుకుంటూ ఉండండి. దాంతో మీ మధ్య ప్రేమాభిమానాలు పెంపొందుతాయి. వైషమ్యాలు దూరమయిపోతాయి." (ముఅత్తా ఇమామ్ మాలిక్)

           కరచాలనం చేసేటప్పుడు, "యగ్‌ఫిరుల్లాహు లనా వలకుమ్” అని అనాలి. అంటే అల్లాహ్ మమ్మల్ని మరియు మిమ్మల్ని క్షమించుగాక! అని అర్థం. (అబూదావూద్)

          హజ్రత్ అనస్ (రజి) కథనం : "దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఎవరితోనయినా కరచాలనం చేస్తే ఎదుటి వ్యక్తి తన చెయ్యి వదిలేంతవరకు ఆయన తన చెయ్యి వదిలేవారు కారు." (తిర్మిజీ)

           కరచాలనం ఒకే చేత్తో చేయటం “మస్నూన్" పద్ధతి. (కనుక కరచాలనం ఒంటి చేత్తోనే చేయాలి.) (బుఖారీ, అబూదావూద్)

           కరచాలనం తర్వాత ఆలింగనం చేసుకోవటం కూడా ఎదుటి వ్యక్తి పట్ల తమకున్న అభిమానానికి అద్దం పడుతుంది. చేయి చేయి కలపటం వల్ల అలాగే ఛాతీకి ఛాతీ కలపటం వల్ల మనసులు కలుస్తాయి. వారి మధ్య సౌభ్రాతృత్వం, మైత్రీ సంబంధాలు పెంపొందుతాయి.

            "దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) జైద్ బిన్ హారిసా (రజి)ను, జాఫర్ బిన్ అబూ తాలిబ్‌ను‌ ఆలింగనం చేసుకున్నారు." (తిర్మిజీ, అబూదావూద్)

            "జైద్ బిన్ హారిసా (రజి) ప్రయాణం నుండి తిరిగొచ్చినప్పుడు దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) ఆయన్ని ఆలింగనం చేసుకొని చుంబించారు." (తిర్మిజీ)

           దైవప్రవక్త ముహమ్మద్ (సల్లం) సహచరులు కొన్ని సందర్భల్లో ఆయన చేతిని ముద్దాడారని కొన్ని హదీసుల ద్వారా బోధపడుతోంది. కనుక మహాత్ముల, దైవభక్తి పరాయణులైన పండితుల చేతుల్ని అప్పుడప్పుడూ ముద్దాడుతూ ఉండటంలో తప్పులేదు. అయితే దాన్ని ఆచారంగా మాత్రం చేసుకోరాదు.

          ఇకపోతే పురుషులు పరస్పర చుంబనానికి సంబంధించిన ఉల్లేఖనాలన్నీ కూడా హదీసు పరిశోధకులు, హదీసువేత్తల దృష్టిలో బలహీనమైనవిగా భావింపబడుతున్నాయి. కనుక ముస్లిం సోదరులు పరస్పరం కలుసుకున్నప్పుడు కుడిచేత్తో కరచాలనం చేసుకుంటే చాలు. వీలైతే ఆలింగనం కూడా చేసుకోవచ్చు. కొంతమంది పండితులు ఆలింగనాన్ని అభిలషణీయమైన ఆచరణగా భావిస్తారు. అయితే ఒకసారి రొమ్ముకి - రొమ్ము కలపటంతోనే ఆలింగనం ఉద్దేశ్యం నెరవేరుతుంది. కనుక మూడుసార్లు కుడి ఎడమల వైపు మార్చి మార్చి ఆలింగనాలు చేసుకోవటం అనవసరం. మననాట ఇదొక ఆచారంగా చెలామణి అవుతోంది. నిజానికి ఇటువంటి ఆలింగన పద్ధతికి ఖుర్ఆన్ హదీసుల్లో ఎక్కడా రుజువు లభించదు.

No comments:

Post a Comment