Hellobar

Wednesday, December 29, 2021

🔶 ఇస్లాం జ్ఞాన సంపద - ప్రాపంచిక వ్యామోహాన్ని పోగొట్టి హృదయాల్ని మృదువుగా మార్చే ప్రవచనాలు🔶

 అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను.
 

🔶 ఇస్లాం జ్ఞాన సంపద 🔶

ప్రాపంచిక వ్యామోహాన్ని పోగొట్టి హృదయాల్ని మృదువుగా మార్చే ప్రవచనాలు


          💫(1868) హజ్రత్ అబూ హురైరా (రజి) కథనం ప్రకారం దైవప్రవక్త ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈ విధంగా తెలియజేశారు : - పూర్వం ఇస్రాయీల్ సంతతిలో ఒక కుష్టు రోగి, ఒక బట్టతలవాడు, ఒక అంధుడు ఉండేవారు. అల్లాహ్ వారు ముగ్గుర్నీ పరీక్షించదలచి ఒక దైవదూతను పంపాడు. ఆ దైవదూత (మానవాకారంలో) మొట్టమొదట కుష్టురోగి దగ్గరికెళ్ళి "నీకు అన్నిటికంటే ఎక్కువ యిష్టమైన వస్తువేది?" అని అడిగాడు. దానికా కుష్టురోగి "అందమైన రంగు, చర్మం. ముందు ఈ వ్యాధి పోవాలి. దీని మూలంగానే జనం నన్ను అసహ్యించుకుంటున్నారు" అని అన్నాడు. దైవదూత అతని శరీరాన్ని స్పృశించాడు. దాంతో అతని కుష్టురోగం పోయి అందమైన చర్మం, ఆకర్షవంతమైన రంగు లభించాయి. అప్పుడు దైవదూత అతనితో “నీకెలాంటి సంపద అంటే ఇష్టం?" అని అడిగాడు మళ్ళీ. దానికా వ్యక్తి "నాకు ఒంటెలంటే ఇష్టం" అని అన్నాడు. వెంటనే అతనికి పది నెలల సూడి ఒంటెలు ప్రసాదించబడ్డాయి. దైవదూత అతడ్ని ఆశీర్వదిస్తూ “అల్లాహ్ నీ పశుసంపదలో శుభాభివృద్దులు ప్రసాదించుగాక" అని అన్నాడు.

         ఆ తరువాత దైవదూత బట్టతల వాడి దగ్గరకు వెళ్ళి “నీకు అన్నిటికంటే ఎక్కువ ఏది యిష్టం?" అని అడిగాడు. "నాకు అందమైన శిరోజాలంటే ఇష్టం. నా బట్టతలను చూసి జనం నన్ను అసహ్యించుకుంటున్నారు. అందుచేత ముందు ఈ బట్టతల పోయి మంచి వెండ్రుకలు రావాలి” అన్నాడు బట్టతలవాడు. దైవదూత చేత్తో అతని తల నిమిరాడు. దాంతో అతని బట్టతలపై అందమైన వెండ్రుకలు వచ్చేశాయి. “మరి నీకెలాంటి సంపదంటే ఇష్టం?” అని అడిగాడు దైవదూత మళ్ళీ. దానికా వ్యక్తి “నాకు ఆవులంటే మహా యిష్టం" అన్నాడు. వెంటనే దైవదూత అతనికి సూడి ఆవులు ఇచ్చేశాడు. పైగా "అల్లాహ్ నీ యీ పశుసంపదలో శుభాభివృద్దులు కలిగించుగాక!” అని దీవించాడు.

           ఆ తరువాత దైవదూత అంధుడి దగ్గరకు వెళ్ళి “నీకు అన్నిటికంటే ఎక్కువ ఇష్టమైన వస్తువేది?” అని అడిగాడు. దానికా వ్యక్తి "అల్లాహ్ నాకు దృష్టి ప్రసాదిస్తే చాలు, అదే నాకు పదివేలు" అని అన్నాడు. దైవదూత అతని ముఖంపై చెయ్యి తిప్పాడు. అల్లాహ్ అతనికి దృష్టి ప్రసాదించాడు. అప్పుడు దైవదూత “సరే, నీకు ఎలాంటి సంపద అంటే ఇష్టం?” అని అడిగాడు. దానికా వ్యక్తి “నాకు మేకలంటే ఇష్టం" అని అన్నాడు. దైవదూత అతనికి సూడి మేకల్ని ఇచ్చాడు.

         దైవదూత ఇచ్చిన ఒంటెలు, ఆవులు, మేకలు ఈని పశుసంపద వృద్ధి అయ్యింది. కుష్టురోగి దగ్గర ఒంటెల మంద, బట్టతల వాని దగ్గర ఆవుల మంద, అంధుని దగ్గర మేకల మంద అయ్యాయి.

          కొంత కాలానికి ఆ దైవదూత ఇది వరకటి లాగే మానవాకారంలో (ఒకప్పటి) కుష్టురోగి దగ్గరకు వచ్చి “నేనొక పేదవాడ్ని, ప్రయాణంలో నా సాధన సంపత్తి అంతా పోయింది. ఇప్పుడు నేను అల్లాహ్ (దయ), నీ సహాయం లేకుండా నా యింటికి కూడా చేరుకోలేని పరిస్థితి వచ్చింది. అందుచేత నీకు అందమైన దేహం, రూపం, సిరిసంపదలు ప్రసాదించిన అల్లాహ్ పేరుతో అర్థిస్తున్నాను. నాకొక ఒంటెను దానం చెయ్యి. దాని మీదెక్కి నేను నా ఇంటికి చేరుకుంటాను” అని అన్నాడు. దానికా కుష్టురోగి "(తన గత జీవితాన్ని విస్మరించి) ప్రస్తుతం నా బాధ్యతలు, ఖర్చులు బాగా పెరిగిపోయాయి (నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను)" అని అన్నాడు. దైవదూత ఈ మాటలు విని “బహుశా నేను నిన్ను గుర్తుపట్టాననుకుంటా. నీవు గతంలో కుష్టురోగిగా ఉండేవాడివి కదూ? దాని వల్ల జనం నిన్ను అసహ్యించుకునేవారు. నీవు పేదవాడిగా ఉంటే, అల్లాహ్ నీకు ఈ సంపద ప్రసాదించాడు. ఔను కదూ?” అని అన్నాడు. కుష్టురోగి (ఈ వాస్తవాలను అంగీకరించకుండా) "ఈ సిరి సంపదలు తరతరాల నుంచి వస్తూ నాకు వారసత్వంలో లభించాయి” అని అన్నాడు. దానికి దైవదూత “నీవు చెప్పింది అబద్ధమయితే అల్లాహ్ నిన్ను తిరిగి పూర్వస్థితికి చేర్చుగాక!" అని శపించాడు.

         ఆ తరువాత దైవదూత తన మొదటి రూపంలోనే బట్టతల వాని దగ్గరకు వెళ్ళి, కుష్టురోగితో అన్న మాటలే అతనితో కూడా అన్నాడు. దానికి బట్టతల వాడు కూడా కుష్టురోగి ఇచ్చినటువంటి సమాధానమే ఇచ్చాడు. దైవదూత అతడ్ని కూడా శపిస్తూ “నీవు చెప్పింది అబద్దమయితే అల్లాహ్ నిన్ను పూర్వ స్థితికి తిరిగి చేర్చుగాక!" అని అన్నాడు.

       అక్కడ్నుంచి దైవదూత తన మొదటి ఆకారంలోనే అంధుని దగ్గరకు వెళ్ళి “నేనొక నిరుపేదను, బాటసారిని, నా ప్రయాణ సామగ్రి అంతా అంతమయిపోయింది. ప్రస్తుతం నేను అల్లాహ్ (దయ), నీ సహాయం లేకుండా నా ఇంటికి చేరుకోలేని పరిస్థితి వచ్చింది. అందుచేత నీకు దృష్టి ప్రసాదించిన అల్లాహ్ పేరుతో అర్థిస్తున్నాను. నాకొక మేకను ఇచ్చెయ్యి. దాంతో నేను నా ప్రయాణాన్ని కొనసాగిస్తాను” అని అన్నాడు. దానికా అంధుడు సమాధానమిస్తూ “నిజమే, నేను అంధుడిగా ఉన్నప్పుడు అల్లాహ్ నాకు దృష్టి ప్రసాదించాడు. నేను పేదవాడిగా ఉన్నప్పుడు ఆయన నన్ను ధనికుడిగా చేశాడు. నేనాయన పట్ల కృతజ్ఞతగా నా ఆస్తిలో నీవు కోరుకున్నది తీసుకునే అధికారం నీకిస్తున్నాను, దైవసాక్షి! ఈ రోజు నీవు అల్లాహ్ పేరుతో (నా ఆస్తిలో) ఏది తీసుకున్నా దానికి నేనెలాంటి అభ్యంతరం చెప్పను (నీవు నిస్సంకోచంగా తీసుకో)" అని అన్నాడు. దైవదూత ఈ మాటలు విని “నీ సంపద నీకే శుభప్రదం (నాకేమీ అవసరం లేదు). ఇదొక పరీక్ష మాత్రమే. (ఇందులో నీవు నెగ్గావు) తత్ఫలితంగా అల్లాహ్ నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. (ఈ పరీక్షలో) నీ సహచరులిద్దరు (విఫలమయి) దైవాగ్రహానికి గురయిపోయారు” అని అన్నాడు. (📚 హదీస్ గ్రంథం : సహీహ్ బుఖారీ :- 60వ ప్రకరణం - అంబియా, 51వ అధ్యాయం - హదీసు అబ్రస్ వ అఖ్ర వ ఆమా ఫీ బనీ ఇస్రాయీల్)

No comments:

Post a Comment